ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అంటూ తమ ప్రాధాన్యలేమిటో సీఎం చంద్రబాబు నాయుడు.. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లోనే చెప్పేశారు. ఆ ప్రాధాన్యాలను అనుసరించి.. రాష్ట్ర రాజధానిని అత్యున్నతంగా నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాజధానిలో ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. 80 శాతం పనులు పూర్తికాగా... మిగతావాటికి వర్షం ఆటంకం కలిగించింది. అయితే రేపటి నుంచి తిరిగి జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. మరోవైపు భారీ వర్షాలు వస్తే అమరావతి మునిగిపోతుందంటూ ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తున్న ప్రభుత్వం.. ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా పక్కా ప్లాన్ రెడీ చేసింది.
ఇందులో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణంలో మూడు కాల్వలను సైతం డిజైన్ చేశారు. ఈ విషయాన్ని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి దీనికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. రాజధాని అమరావతి చాలా సురక్షితంగా ఉందన్న నారాయణ.. కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా రాజధాని నిర్మాణం ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్స్ డిజైన్ టేసినట్లు చెప్పారు. వీటి గురించి ఏడీసీ ఛైర్మన్, అధికారులతో మాట్లాడామన్న మంత్రి.. వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. వీటితో పాటుగా వైకుంఠపురం, ఉండవల్లి వద్ద పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. అలాగే ఆరు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసామన్న మంత్రి.. ఇవన్నీ పూర్తి అయితే అమరావతిలో ఎలాంటి వరద సమస్యా ఉండదని స్పష్టం చేశారు.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని నారాయణ ప్రజలకు సూచించారు. అమరావతి మునిగిపోయిందని ప్రచారాలు చేశారన్న మంత్రి.. వాటిని నమ్మి ఇబ్బందులు పడవద్దని ప్రజలకు సూచించారు. రాజధాని నిర్మాణంలో ప్లాన్ చేసిన కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి అయితే ఎలాంటి సమస్యలు ఉండవని తెలిపారు. మరోవైపు రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సేకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. భూమిని ఇచ్చే రైతులు తమకు సమాచారం ఇస్తే.. వారి ఇంటికి నేరుగా వెళ్లి అంగీకారపత్రాలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ప్రభుత్వ భూములు ఉన్నచోట ఎక్కడ కోరితే అక్కడ వారికి ప్లాట్లు కేటాయిస్తామని నారాయణ వివరించారు.