రెండు దశాబ్దాల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వీధుల్లో తిరుగుతూ జీవనం సాగించాడు. గమ్యంలేని జీవితాన్ని గడిపాడు.’ ఈ క్రమంలో అనుమానస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతని గురించి విచారించారు. తల్లిదండ్రుల వివరాలు తెలపడంతో చొరవ తీసుకున్న పోలీసులు అతడిని తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే సింగరాయ కొండ మండలం సోమరాజుపల్లి గ్రామానికి చెందిన సుందరశెట్టి కోటేశ్వరరావు, శేషమ్మ దంపతులకు ముగ్గరు సంతానం. వారిలో చివరివాడు శ్రీహరి. వ్యవసాయాధారిత కుటుం బం వారిది. అందరూ కలిసి పనిచేస్తేనే కుటుంబం గడిచేది. సుమారు 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల వయసులో శ్రీహరి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కూలీ పనులు చేసుకుంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిరిగాడు. ఎక్కడ పనిదొరికితే అక్కడ చేసుకోవడం కడుపు నింపుకోవడం చేసేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శ్రీహరి అతని సహచరుడు కేశవతో కలిసి ఫూటుగా మద్యం సేవించి తిరుపతి నుంచి గుంటూరు వెళ్లే రైలు ఎక్కారు.
శనివారం తెల్లవారుజామున మార్కాపురం రైల్వే స్టేషన్‌లో దిగారు. అక్కడ నుంచి ఎస్టేట్‌కు వచ్చి మద్యందుకాణం వద్ద మద్యం సేవించి అనుమానస్పదంగా తిరుగుతున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగతనాలకు పాల్పడుతున్న వాళ్లేమోనని అనుమానించి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. భయపడిన శ్రీహరి అతని చిరునామాను తెలియజేశాడు. పట్టణ ఎస్సై సైదుబాబు సింగరాయకొండ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడి పోలీసులు సోమరాజుపల్లి వెళ్లి విషయాన్ని తెలియజేశారు. తల్లి శేషమ్మ సంతోషించి మార్కాపురం వచ్చింది. అతను తన కుమారుడే అని 20 ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని తెలియజేసింది. ఆమె పూచికత్తు మేరకు శ్రీహరిని పోలీసులు పంపించారు. తన కుమారున్ని అప్పజెప్పిన మార్కాపురం పోలీసులకు శ్రీహరి తల్లి, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.