తిరుమలలో కలకలం రేపిన కల్తీ నెయ్యి దోషాన్ని గత నెల ఆగస్టులో సంప్రోక్షణతో పోగొట్టామని, భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు వెల్లడించారు. నిన్న(ఆదివారం) రాత్రి తిరుపతిలో పద్మావతి రెస్ట్ హౌస్‌లో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు మోహనరంగాచార్యులు, రామకృష్ణ దీక్షితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో తెలుసో తెలియక జరిగే దోష నివారణకు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ఆగస్టులోనే ఆలయంలో అన్న ప్రసాదపోటు, లడ్డూ పోటులో సంప్రోక్షణ చేశాం. అందులోని కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను సమర్పించాం. కల్తీ నెయ్యి వలన ఏమైనా దోషాలు ఉండుంటే కూడా తొలగిపోయాయి. అయినప్పటికీ భక్తుల్లో నెలకొన్న ఆందోళన దృష్ట్యా ఆగమశాస్త్ర పండితులు, పెద్దజియ్యంగార్లను సంప్రదించిన తర్వాత సీఎం చంద్రబాబు శ్రీవారి ఆలయంలో ఒకరోజు శాంతి హోమం నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు.
ఇందులో భాగంగా సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శాంతిహోమం చేస్తున్నాం. శ్రీవారి ఆలయంలోని యాగబావి వద్ద యాగశాలలో, మూడు హోమగుండాలు (వాస్తు, సభ్యం, పౌండరీక) ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా అన్ని ఆలయాల్లో పంచగవ్య ప్రోక్షణ చేయనున్నాం’’ అని ఈవో శ్యామలరావు వివరించారు.