తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులు ఇచ్చారని అన్నారు. ఆ ఆస్తులను వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన టీటీడీ పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను... భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.భక్తులు ఇచ్చిన ఆస్తులను విక్రయించాలని గత టీటీడీ పాలక మండలి నిర్ణయించి ప్రకటన కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. అసలు నాటి పాలక మండలి స్వామి వారి ఆస్తులను పరిరక్షణ కంటే పప్పుబెల్లాల్లా అమ్మేయడానికే ప్రయత్నించిందని మండిపడ్డారు. టీటీడీని ఆ విధంగా నడిపించింది ఎవరు? అనేది బయటకు తీస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్లకు నేతృత్వం వహించినవారు కాపాడారా? వాటిని అమ్మేశారా? అనే సందేహాలు భక్తులకు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. టీటీడీ ఆస్తుల విషయంలో గతంలో చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కోరారు.
గత పాలక మండలి తమిళనాడులో 23 ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని చూసిందని అన్నారు. ఆ ఆస్తుల విలువ రూ.23.92 కోట్లుగా లెక్కగట్టారని చెప్పారు. టీటీడీ ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రయత్నించిందని చెప్పారు. చాలా ప్రాంతాల్లో ఉన్న టీటీడీ ఆస్తులను దోచేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీలు, పలు హిందూ ధార్మిక సంస్థలు బాధ్యతగా, బలంగా స్పందించాయని పవన్ కళ్యాణ్ చెప్పారు.