తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నూనెలు వాడారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓ.వి. రమణ సోమవారం తిరుపతిలో స్పందించారు. నెయ్యిలో జరిగిన దుర్మార్గం మళ్లీ జరగకూడదంటే పాలకమండలి సభ్యుల నియామకం నుంచి పర్చేజ్ కమిటీ వరకు ప్రతి అంశంలోనూ ప్రక్షాళన అవసరమని ఆయన స్పష్టం చేశారు. 1963లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలిలో 11 మంది సభ్యులున్నారన్నారు.
1979 నాటికి పాలక మండలి సభ్యుల సంఖ్య 13కి చేరిందని చెప్పారు. ఇక 2004 నాటికి ఆ సంఖ్య కాస్తా 15 అయిందన్నారు. కానీ 2019లో ఆ సంఖ్యను 25కు పెంచారని ఈ సందర్బంగా ఒ.వి.రమణ గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్ అఫిషియో సభ్యుల నియామకం సైతం జరుగుతోందన్నారు. ఇటువంటి నియామకాలు తగవని కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగాఆయన సూచించారు.