తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. అనంతరం స్వామి వారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు. ‘‘మహా మూర్తి శరణాగతి తండ్రి.. గత కొద్ది రోజులుగా నా మనసు కలత చెందుతోంది. సర్వ జగద్రక్షుడు క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం. అపచారం. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు, లడ్డు విషయంలో కళంకిత మైనది అని కలుషిత రాజకీయ మనష్కులు. అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను గాని తప్పు చేసి ఉంటే.. నేను నా కుటుంబం సర్వ నాశనం అయిపోవాలి. నెయ్యిలో తప్పు జరిగి ఉంటే సర్వ నాశనం అయిపోతాము. నేను ఏ ఒక్క రాజకీయ మాట మాట్లాడలేదు. గోవిందా..గోవిందా’’...అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు.
ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణీలో స్నానం చేసి, శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద స్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని, అఖిలాండం కర్పూర హారతి వెలిగించి భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ సమయంలో భూమన వెంట ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి ఉన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు భూమన ప్రమాణం చేశారు.