తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఈ క్రమంలో టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి హోమం నిర్వహించింది. ఇవాళ ఉదయం చేపట్టిన మహాశాంతి యాగం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం ముగిసింది. ఇవాళ(సోమవారం) రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమం నిర్వహించినట్లు పండితులు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు మహాశాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహించామని తెలిపారు ఈవో శ్యామలరావు, ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు. శ్రీవారి ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ జరిగిందని.. స్వామివారికి మహా నైవేద్యం పూర్తి చేశామన్నారు. తిరుమలలోని ప్రసాదాల తయారీ కేంద్రాల్లో సంప్రోక్షణ చేశామని.. దోషం కలిగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. శాంతి హోమం తర్వాత పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయని.. ఇక తిరుమల శ్రీవారి భక్తులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం నిర్వహించామని తెలిపారు ప్రధనార్చకులు, ఈవో. తిరుమల ఆలయంలో.. ఆగస్టు నెలలో నిర్వహించిన పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని.. లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. ఈ దోషం పవిత్రోత్సవాల ముందు జరిగిందని.. అప్పుడే పవిత్రోత్సవాలతోనే పోయిందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మార్చిన నెయ్యితోనే ప్రసాదాలు తయార చేశారని.. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతి హోమం, సంప్రోక్షణతో పోతాయని తెలిపారు ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు. ప్రతిరోజూ శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్క రోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద టీటీడీ మహాశాంతి హోమం నిర్వహించి.. సంప్రోక్షణ పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తెలిపింది.