ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిలో లా కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సోమవారం సచివాలయంలో న్యాయశాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు.. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపుతామని చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు పది వేలు గౌరవ వేతనం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే వారికోసం ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుకు కార్యాచారణ సిద్ధం చేయాలని ఆదేశించారు.
మరోవైపు మైనారిటీ సంక్షేమ శాఖపైనా చంద్రబాబు సమీక్ష జరిపారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అమలు చేసిన మైనార్టీ సంక్షేమ పథకాలను తిరిగి తెచ్చే విషయమై అధికారులతో చర్చించారు. అలాగే కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజన్‌లకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది. అలాగే బీజేపీ కూడా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది. ఇందులో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు కూడా అప్పట్లో డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. వచ్చే ఏపీ మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉంది.