ఛైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని స్పష్టం చేసింది. ఇలాంటి తీర్పును ఇచ్చి హైకోర్టు ఘోరమైన తప్పిదానికి పాల్పడిందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు చెల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తీర్పు వెలువరించింది.
ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. పోక్సో చట్టంలో ‘ఛైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ‘ఛైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్’ అనే పదంగా మారుస్తూ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని సూచించింది. ఆ సవరణలు అమల్లోకి వచ్చేవరకు ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని, ఇకపై కోర్టులు ‘ఛైల్డ్ పోర్నోగ్రఫీ’ పదాన్ని ఉపయోగించరాద్దని ధర్మాసనం ఆదేశించింది.
ఛైల్డ్ పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 28 ఏళ్ల యువకుడిపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ ఈ ఏడాది జనవరి 11న మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం నేరమేమీ కాదంటూ ఆ సందర్భంగా పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ యువకుడు వీడియోలు చూడటం తప్ప ఏమీ చేయలేదని, వాటిని ఇతరులకూ పంపలేదని వ్యాఖ్యానించింది. పోర్నోగ్రఫీకి అలవాటుపడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గం వైపు నడిపించడంపై దృష్టి పెట్టాలని తెలిపింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు, బాల హక్కులు, సంక్షేమ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించింది. కాగా, ఈ తీర్పును రాసే అవకాశం తనకు ఇచ్చినందుకు.. సీజేఐకు జస్టిస్ పార్దివాలా ధన్యవాదాలు తెలిపారు.
‘‘పిల్లలకి సంబంధించిన ఏదైనా అశ్లీల వీడియోలను మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి స్టోర్ చేసిన వ్యక్తి.. దానిని నివేదించడం లేదా తొలగించడంలో విఫలమైతే రూ.5 వేలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు.. పునరావృతం చేస్తే రూ.10 వేలకు తక్కువ కాకుండా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.. వాటిని ఎవరికైనా షేర్ చేయడానికి డౌన్‌లోడ్ చేసినట్టు నిర్దారణ అయితే జరిమానాతో పాటు, మూడేళ్ల జైలు శిక్ష ఎదుర్కొక తప్పదు... వాటితో వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తే గరిష్ఠంగా ఏడేళ్లు జైలు.. జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ’’ అని జస్టిస్ జేబీ పార్దీవాలా తీర్పు రాశారు.