కదులుతోన్న రైల్లో ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై. వేరే కోచ్‌లోకి పరుగెత్తారు. ఈ ఘటన జబల్‌పుర్-ముంబయి గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్.. ముంబయి నగరాల మధ్య తిరిగే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం బయలుదేరింది. ఈ రైలు కాసర రైల్వే స్టేషన్ సమీపిస్తున్న సమయంలో జీ3 బోగీలో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమైంది.
జీ3 కోచ్ 23వ నెంబరు (అప్పర్ బెర్త్) హ్యాండిల్‌కు చుట్టుకొని ఉండటంతో భయపడిపోయిన ప్రయాణికులు వేరే కోచ్‌లోకి వెళ్లారు. అనంతరం రైల్వే అధికారులకు సమాచారం అందించారు. రైలు కాసరకు చేరుకున్న తర్వాత.. రైల్వే సిబ్బంది జీ3 కోచ్‌లో చుట్టుకుని ఉన్న పామును పట్టుకుని.. బయటకు పదిలేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఈ ఘటనలో ఎవరికి ఏం జరగలేదని అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హర్షిత్ శ్రీవాస్తవ ఈ ఘటనను ధ్రువీకరించారు. దీనిపై పూర్తి సమాచారం కోసం సెంట్రల్ రైల్వేతో అధికారులు సమన్వయం చేస్తున్నారని చెప్పారు. అయితే, రైల్లోకి పాము ఎలా ప్రవేశించిందనేది తెలియాల్సి ఉంది.
కాగా, గతంలో రైలు కోచ్‌ల్లోకి వర్షపు నీటి లీకేజీలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కానీ, విషసర్పం రైలులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, గతేడాది సెప్టెంబరులోనే చంబల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో కొందరు పాములను వదిలిపెట్టిన ఘటన కలకలం రేపింది. పాములను ఆడించినా డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ప్రయాణికులను భయపెట్టడానికి ఇలా చేశారు.
పాములు కోచ్‌లో తిరగడంతో హడలిపోయిన ప్రయాణికులు. ఆమె తమను కాటు వేస్తాయనే భయంతో పై బెర్తులపైకి ఎక్కారు. మరికొందరు మరుగుదొడ్లలోకి దూరి గడియపెట్టుకున్నారు. దాదాపు అరగంట పాటు రైల్లో భయానక వాతావరణం నెలకొంది. ప్రయాణికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో పాములను ఆడించే వారు అప్రమత్తమై పాములను తిరిగి బంధించారు.