ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్న వేళ.. కేంద్ర మంత్రి, నాగపూర్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ మరో బాంబు పేల్చాడు.ఇటీవలను ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తనకు ప్రధాని ఆఫర్ వచ్చిందని తెలిపారు. ఓ నేత తనకు ఆఫర్ ఇచ్చారని, కానీ, తాను పార్టీకి కట్టుబడి ఉంటానని సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. అయితే ఆఫర్ ఇచ్చిన నేత పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. గడ్కరీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఇప్పుడు మోదీ 4.0 పై బాంబు పేల్చారు. అమెరికాలో ఉన్న మోదీ 2029లో కూడా అధికారం బీజేపీదే అని చెబుతున్నారు. హోం మంత్రి అమిత్‌షా కూడా అంతే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. కానీ, మరో కేం6ద మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం 2029లో బీజేపీ గెలుపు కష్టమే అంటున్నారు. సాధారణంగా దేశంలో ఏ పార్టీ అయినా రెండోసారి అధికారం చేపట్టడమే కష్టం. కానీ, ప్రధాని మోదీ చరిష్మాతో దేశంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోదీ కూడా వరుసగా మూడోసారి ప్రధాని అయి.. నెహ్రూ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. ఇక ఇప్పుడు మోదీ 4.0పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పార్టీలో మంచి గుర్తింపు ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వరుసగా మోదీ ప్రభుత్వంలో మూడుసార్లు కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న గడ్కరీ స్వేచ్ఛగా మాట్లాడుతుంటారు. అవి కొన్నిసార్లు సంచలనం అవుతాయి. తాజాగా అదే జరిగింది. 'మళ్లీ గెలుస్తామో లేదో? తమ ప్రభుత్వం వరుసగా నాలుగోసారి అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేం' అని అన్నారు. మహారాష్ట్రలో మరో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్నొ ్న ఆయన ఈ వ్యాక్యలు చేశారు. అథవాలే మళ్లీ మంత్రి అవుతారో లేదో గ్యారంటీ లేదు అన్నారు. అంతలోనే నాలుక తడుముకుని.. తాను జోక్ చేస్తున్నా అని వ్యాఖ్యానించారు.
గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. అదే కార్యక్రమంలో మంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ.. వచ్చేసారి కూడా తాను మంత్రి అవుతానని తెలిపారు. నవంబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో గడ్కరీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇక్కడ బీజేపీ, శివసేన, అథవాలే పార్టీ మహాయుతి కూటమిగా అధికారంలో ఉన్నాయి. మళ్లీ గెలవాలని ప్రయత్నిస్తున్నాయి.