తన రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారి ఆలయం, రాష్ట్ర ప్రతిష్ట మంట గలిసే విధంగా సీఎం చంద్రబాబు మాట్లాడారన్న, మాజీ మంత్రి కొడాలి నాని, అందుకు చంద్రబాబును ఆ దేవదేవుడు ఎప్పటికీ క్షమించడని స్పష్టం చేశారు. చంద్రబాబు ఐదేళ్ల గత పాలనలో నలుగురు బిడ్డర్లుకు నాలుగు దఫాలుగా టెండర్లు ఇవ్వగా.. నెయ్యిలో నాణ్యత లేదని 14 ట్యాంకర్లు వెనక్కి పంపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా 18 నెయ్యి ట్యాంకర్లు తిప్పి పంపారని గుర్తు చేశారు.
టీటీడీలో సరుకుల నాణ్యతకు అంత ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. తప్పు చేస్తే మక్కెలిరగ్గొడతానన్న చంద్రబాబు.. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్‌పై దాడి, దౌర్జన్యం చేసినా, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ చిత్రపటాన్ని చింపేసినా ఏ చర్య తీసుకోలేదని కొడాలి నాని ఆక్షేపించారు.