రాష్ట్రంలో ఏ మూలన, ఏ తప్పు జరిగినా దాన్ని వైయస్ఆర్‌సీపీకి అంటగడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆక్షేపించారు. ఆ విధంగా జగన్‌గారిని అప్రతిష్టపాలు చేస్తూ, ఆయనను రాజకీయంగా దెబ్బ తీయాలనే కుట్ర సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరుగుతోందని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...... రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలం హనకనహాల్‌లో జరిగిన శ్రీరాముడి రథం దహనం కేసును వైయస్ఆర్‌సీపీ మీదకు నెట్టి, రాజకీయంగా లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని ఆరోపించారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన రథం దహనం దుర్ఘటనను స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే అన్నారు.
ప్రమాదం జరిగిన రోజునే రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదానికి రాజకీయాలకు సంబంధం లేదని, వ్యక్తిగత కక్షలతోనే జరిగినట్లు చెప్పారన్న ఆయన, అందుకు సంబంధించిన వీడియోను మీడియాకు చూపారు. అంతే కాకుండా, ప్రమాద విషయం తెలిసిన వెంటనే కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది ఆ ప్రాంతాన్ని సందర్శించి, అది వ్యక్తిగత తగాదాలతో జరిగిందని తేల్చారని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్న పది మందిలోవైయస్ఆర్‌సీపీ, టీడీపీకి చెందిన వారితో పాటు, కొందరు తటస్థులు కూడా ఉన్నారని అనంత వెంకటరామిరెడ్డి వెల్లడించారు. అయితే విజయవాడలో మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, రథం దహనం ఘటనపై అనుమానం ఉందని చెప్పగానే, మాట మార్చిన జిల్లా ఎస్పీ, నిందితులు వైయస్ఆర్‌సీపీ కి చెందిన వారని చెప్పారని ఆక్షేపించారు. నిజానికి ఈ కేసులో అరెస్టయిన వారంతా మొన్న ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పని చేశారని ఆయన తెలిపారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన ఎస్పీ.. వివాదాలను రేకెత్తించే విధంగా పార్టీల ప్రస్తావన తీసుకు రావడం, మత కలహాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊర్కోబోమని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు.