క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని, 2027లో జరిగే జాతీయ క్రీడలను మన రాష్ట్రంలో నిర్వహించే లక్ష్యంతో సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పిలుపునిచ్చారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో క్రీడలకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని అన్నారు. అమరావతిలో అతిపెద్ద క్రీడా స్టేడియం నిర్మాణం చేపడతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఆయన అంగీకరించారు. అందరికీ అందుబాటులో ఉండేలా వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామ స్థాయిలో ఆటల మైదానాలు, నియోజకవర్గ స్థాయిలో క్రీడా వికాస కేంద్రాలు, జిల్లా స్థాయిలో క్రీడాభివృద్ధి సంస్థలు, రాష్ట్ర స్థాయిలో హై పెర్ఫామెన్స్ సెంటర్లు, అకాడమీలు ఏర్పాటు చేస్తామన్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చామని చెప్పారు. తాము స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపడితే.. వైసీపీ సర్కారు అన్ని పనులూ నిలిపివేసిందని అన్నారు. నాడు ప్రారంభమై కొంతమేర పూర్తయిన వాటి నిర్మాణాలను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాస కేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామిక వేత్తలు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ముందుకొస్తే, వాటికి వారి పేర్లు పెట్టుకునే అవకాశం కల్పించాలన్నారు. 2017లో రూపొందించిన క్రీడాపాలసీ 2022లో ముగిసినా వైసీపీ ప్రభుత్వం కొత్త పాలసీ రూపకల్పనపై చొరవ చూపలేదన్నారు. త్వరలోనే నూతన క్రీడా పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పతకాల సాధనలో ఏపీ వెనుకబడి ఉందని, ఈ విషయంపై ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. తిరుపతి, అమరావతి, వైజాగ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన ప్రాజెక్ట్ గాండీవ, పాంచజన్య, విజయ, స్పోర్ట్స్ నర్సరీస్ కార్యక్రమాలను తిరిగి పునరుద్ధరించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని స్టేడియాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ సదుపాయం కల్పించాలన్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో క్రీడా అకాడమీల ఏర్పాటుకు స్థలాలు పొందిన వారితో సంప్రదింపులు జరిపి వెంటనే వాటి ఏర్పాటు పూర్తిచేసేలా చూడాలన్నారు. వారు ఆసక్తి చూపకపోతే కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలన్నారు. రాష్ట్ర సచివాలయలంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చిన్నపాటి స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ల కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. పోలీస్, యూనివర్సిటీ, ప్రైవేటు విద్యా సంస్థల గ్రౌండ్స్‌ను సామాన్య ప్రజలకు నిర్దేసిత సమయం వరకూ అందుబాటులోకి తేవాలన్నారు. సమావేశంలో క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa