తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ఇవాళ తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం జగన్ మీడియా సమావేశం నిర్వహించారు.ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ... దేవుడి దగ్గరకు వెళుతుంటే అడ్డుకునే కార్యక్రమాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. జగన్ తో పాటు వెళ్లేందుకు అనుమతి లేదంటూ వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇది రాక్షస రాజ్యం కాదా? అని ప్రశ్నించారు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. వంద రోజుల ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులను పిలిపించారని... ఇది బీజేపీ పెద్దలకు తెలుసో? తెలియదో? అని జగన్ చెప్పారు. తిరుమలకు అనుమతి లేదంటున్నారని... మాజీ సీఎంకు స్వామిని దర్శించుకునే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేసి దేవుడి పవిత్రతను దెబ్బతీశారని దుయ్యబట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేశారని అన్నారు. తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అబద్ధాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు.తప్పులు చేయలేని విధంగా టీటీడీ వ్యవస్థ ఉంటుందని జగన్ చెప్పారు. ప్రసిద్ధిగాంచిన వ్యక్తులే టీటీడీ బోర్డులో ఉంటారని... వారే నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. టీటీడీ టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వానికి ప్రమేయం ఉండదని చెప్పారు. టెండర్లలో తక్కువ కోట్ చేసిన వారికే ఆర్డర్లు ఇస్తారని తెలిపారు. టీటీడీ చరిత్రలో తొలిసారి లడ్డూ శాంపిల్ ను గుజరాత్ లోని ల్యాబ్ కు పంపించారని అన్నారు.