ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ బిచ్చగాళ్ల రేంజే వేరు.. విమానమెక్కి, విదేశాలకెళ్లి భిక్షాటన

international |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 10:22 PM

పాకిస్థాన్ పేరెత్తగానే మత ఛాందసవాదం, సైనిక ప్రభుత్వాలు, ఉగ్రవాదం, భారత్ పట్ల ఆ దేశం కనబర్చే అక్కసు మనకు గుర్తొస్తుంది. కానీ తోటి ఇస్లామిక్ దేశాలకు మాత్రం పాకిస్థాన్ బిచ్చగాళ్లను ఎక్స్‌పోర్ట్ చేసే కేంద్రంగా కనిపిస్తోంది. ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న అయిపోవాలని కలలుగన్న పాకిస్థాన్.. ఇప్పుడు ఆ దేశాలు ఈసడించుకునే స్థాయికి దిగజారింది. ఎందుకంటే ఏటా పెద్ద సంఖ్యలో పాకిస్థాన్ బిచ్చగాళ్లు విమానం ఎక్కి తోటి ఇస్లామిక్ దేశాలకు, మరీ ముఖ్యంగా అరబ్ దేశాలకు వెళ్తున్నారు. పర్యాటకుల ముసుగులో వీరు అరబ్ దేశాలకు వెళ్లి.. అక్కడ భిక్షాటన చేసి, డబ్బులు కూడబెడుతున్నారు.


టూరిస్టుల ముసుగులో సౌదీ అరేబియా లాంటి దేశాలకు వెళ్తోన్న పాకిస్థాన్ బిచ్చగాళ్ల సంఖ్య కొంత కాలంగా పెరుగుతోంది. ఇదంతా ఓ మాఫియాలా తయారైంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని బిచ్చగాళ్లలో 90 శాతం మంది పాకిస్థానీలే ఉన్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


మక్కా, మదీనా లాంటి పవిత్ర క్షేత్రాలను సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సౌదీ వెళ్తుంటారు. దీంతో పాకిస్థానీలు కూడా హజ్, ఉమ్రా యాత్రికుల్లా సౌదీ వెళ్లి.. పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చే సాటి ముస్లింల దగ్గర యాచిస్తున్నారు. హజ్ యాత్రకు వెళ్లేందుకు పాకిస్థాన్ బిచ్చగాళ్లు తెగ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో హజ్ యాత్ర వీసా పొందేందుకు ప్రయత్నిస్తున్న సగటు పాకిస్థానీలకు వీసా దొరకడం కష్టంగా మారుతోంది.


తమ దేశంలో ఎక్కడ చూసిన పాకిస్థాన్ బిచ్చగాళ్లే కనిపిస్తుండటాన్ని సౌదీ అరేబియా సీరియస్‌గా తీసుకుంది. ఒకవేళ పరిస్థితి నియంత్రణలోకి రాకపోతే.. దాని ప్రభావం మీ దేశ హజ్, ఉమ్రా యాత్రికులపై పడుతుందని సౌదీ మత వ్యవహారాల శాఖ ఇటీవలే పాకిస్థాన్‌ను హెచ్చరించింది.


‘నేను ఇప్పుడే ఉమ్రా (మక్కా యాత్ర) నుంచి తిరిగొచ్చాను. ఓ పాకిస్థానీగా నేనెంతో సిగ్గుపడుతున్నా. మనోళ్లు ఎక్కడపడితే అక్కడ అడుక్కుంటున్నారు. బిన్ దావుద్ స్టోర్ లోపల, ఉమ్రా సమయంలో, వీధుల్లో మనోళ్లు అడుక్కుంటున్నారు’’ అని ఇస్లామాబాద్‌కు చెందిన ఉస్మాన్ అనే వ్యక్తి సెప్టెంబర్ 25న ట్విటర్లో పోస్టు చేశారు. మక్కా, మదీనాల్లో దుకాణం పెట్టి.. విదేశాల నుంచి వస్తోన్న యాత్రికులను డబ్బుల కోసం పాకిస్థానీలు వేధిస్తున్నారట.


ఎక్కడైనా బిచ్చగాళ్లు తమ దేశంలో యాచిస్తారు. కానీ పాకిస్థాన్ బిచ్చగాళ్లు మహా ప్రొఫెషనల్‌గా.. వీసా కోసం దరఖాస్తు చేసి.. విమానం ఎక్కడి విదేశాలకు వెళ్లి మరీ తమ డ్యూటీ చేసి వస్తుండటం గమనార్హం. అంటే రానుపోను విమాన ఖర్చులు, సౌదీలో ఉండేందుకు అవసరమైన ఖర్చుల కంటే ఎక్కువగానే వీళ్లు బెగ్గింగ్ ద్వారా సంపాదిస్తున్నారన్నమాట.


పాకిస్థాన్ బిచ్చగాళ్లు కేవలం సౌదీకే పరిమితం కాలేదు. యూఏఈ సహా అనేక అరబ్ దేశాల్లో వీరు కనిపిస్తారు. మలేసియాలోనూ పాకిస్థాన్ బిచ్చగాళ్ల బెడద ఉంది. ఉమ్రా వీసాలపై పాకిస్థాన్ బిచ్చగాళ్లు సౌదీ వెళ్లి.. అక్కడి వీధుల్లో భిక్షాటన చేస్తున్నారని సౌదీ, ఇరాక్ రాయబారులు చెబుతున్నారు. బిచ్చగాళ్ల కారణంగా తమ దేశం పరువు పోతుండటంతో పాకిస్థాన్ అప్రమత్తం అవుతోంది. ఈ బిచ్చగాళ్లు ఎవరికి వాళ్లుగా సౌదీ వెళ్లడం లేదని.. ఓ మాఫియానే ఇలా చేస్తోందని పాక్ భావిస్తోంది. ఈ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా రాయబారి నవాఫ్ బిన్‌కు పాకిస్థాన్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ హామీ ఇచ్చారు.


విదేశాలకు బిచ్చగాళ్లను పంపిస్తోన్న ఈ బెగ్గింగ్ మాఫియా నెట్‌వర్క్‌ను చేధించడానికి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని పాకిస్థాన్ రంగంలోకి దింపింది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు.. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులలో ప్రయాణికులను జాగ్రత్తగా గమనిస్తున్నారు. తరచుగా అరబ్ దేశాలకు వెళ్లే వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఎవరి మీదైనా అనుమానం వస్తే.. వెంటనే విమానం నుంచి దింపేస్తున్నారు. నెల రోజుల క్రితం కరాచీ నుంచి సౌదీ వెళ్తున్న విమానంలో నుంచి 11 మందిని ఇలాగే దింపేశారు. బిచ్చగాళ్ల కారణంగా.. ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే పాకిస్థానీలు ఇబ్బందులు పడుతున్నారు.


పాకిస్థానీ బిచ్చగాళ్ల గోల ఎక్కువ కావడంతో.. గల్ఫ్ దేశాలు పాకిస్థానీలకు బదులు బంగ్లాదేశ్ లాంటి దేశాలకు చెందిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇతర దేశాలు సైతం పాకిస్థానీలతో ఎందుకొచ్చిన తలనొప్పి అనే భావనలో ఉంటున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com