నాలుగు నెలల్లోనే చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. బాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో కూడా ఉన్నారని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు దుష్ట రాజకీయాలపై మండిపడ్డారు.
‘‘సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు. స్కూళ్లు, చదువులు, విద్యాదీవెన, వసతి దీవెన పోయాయి. అమ్మ ఒడి, ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ పోయాయి. డోర్ డెలివరీ, వాలంటీర్ల వ్యవస్థ పోయింది. రైతు భరోసా, వ్యవసాయం కూడా పోయింది. ఇలా అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలింది. విద్య, వైద్య-ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉంది. రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతోంది. తప్పుడు కేసులు పెడుతున్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడంలేదు. పారదర్శకత అన్నది ఎక్కడా లేదు’’ వైయస్ జగన్ నిలదీశారు. ‘‘విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం. ఎన్యుమరేషన్‌ను సరిగ్గా చేయలేకపోయారు. కలెక్టర్ల కార్యాలయం చుట్టూ బాధితులు తిరగాల్సిన పరిస్థితి. తమకు నచ్చినవారికి మాత్రమే ఇస్తున్నారు. పరిపాలన ఇంత ఘోరంగా ఉంది. అందుకనే ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త టాపిక్స్ తెర మీదకి తెస్తున్నారు. ఆ కొత్త టాపిక్స్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. వీళ్ల చేసిన పనులతో దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు’’ అని మాజీ సీఎం పేర్కొన్నారు.