ఏపీలో చెత్త పన్నుపై ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెత్త పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ‘‘చెత్త మీద పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నాం.. వచ్చే క్యాబినెట్‌లో పెట్టి ఆదేశాలు ఇస్తాం.. అధికారులు కూడా చెత్త పన్నును ఇకపై వసూలు చేయవద్దు’’ అంటూ సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం నాడు మచిలీపట్నంలో స్వచ్చ సేవ ప్రజావేదిక సభలో పాల్గొన్న సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. గ్రామ పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ సెంటర్లను గతంలో తాము ఏర్పాటు చేశామని.. అయితే చెత్తను తీసుకుపోవడం మానేసి, షెడ్లకు సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల ముఖానికి వేసి ఊరంతా తిప్పితే బుద్ది వచ్చేదని విరుచుకుపడ్డారు. ‘‘ఉదాత్తమైన మనసుతో షెడ్‌లు పెడితే... కేంద్రం డబ్బులు ఇచ్చింది. వాటిని కూడా ఇష్టం వచ్చినట్లు చేసి నిధులు లేకుండా చేశారు. కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్లు రెండు మాత్రం పని చేస్తున్నాయి. మిగతా అన్ని ఫ్లాంట్లు పనికి రాకుండా చేశారు. రోడ్ల మీద చెత్త ఉండేందుకు వీలు లేదు.. ఎన్ని ప్లాంట్లు అయినా పెడతాం. చెత్త నుంచి కరెంటు తయారీ ప్లాంట్లను పునరుద్ధరిస్తాం. ప్రతిఒక్కరూ స్వచ్చ సేవకులు కావాలి.. స్వచ్చ ఆంధ్రప్రదేశ్ సాధించాలి. గాంధీ జయంతిన 2029 కి ఏపీ స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌గా తయారు కావాలని మనం సంకల్పం చేయాలి’’ అంటూ సీఎం పిలుపునిచ్చారు.