మొన్న విజయవాడలో వచ్చిన వరదలలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు చాలా గొప్పవని సీఎం చంద్రబాబు కొనియాడారు. బుడమేరు గండ్లు పూడ్చకుండా గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు వచ్చిందన్నారు. విజయవాడ మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్థితికి వచ్చిందన్నారు. ఆరేడు అడుగుల నీరు రోడ్లపైనా, ఇళ్లల్లో నిలిచిందని... నీరు పోయే పరిస్థితి లేక.. పై నుంచి వస్తున్న నీటితో తల్లడిల్లామని తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు తీవ్రంగా శ్రమించామన్నారు. లక్షలాది మంది ప్రజలకు అవసరమైన సేవలు అందించామన్నారు. ప్రజల కోసం బురదలో నడిచానని, ప్రొక్లైనర్ ఎక్కా.. వరద నీటిలోకి వెళ్లామని వెల్లడించారు. ప్రజలకు అన్ని సదుపాయాలు అందించి, వరద నీరు పంపాకే తాను బయటకు వచ్చినట్లు తెలిపారు.