మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ బాపూజీకి ఘనంగా నివాళులర్పిస్తూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. సత్యం, అహింస ఆయుధాలుగా భారతదేశపు స్వేచ్ఛా స్వాతంత్య్ర సమరాన్ని ముందుండి నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. స్వరాజ్యం సాధించిన బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యం కావాలన్నారు. సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
కాగా రెండు రోజుల క్రితం ‘క్లీన్ అండ్ గ్రీన్’లో భాగంగా మంగళగిరిలో పరిసరాల పరిశుభ్రతకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఈ పనులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తానని లోకేష్ తెలిపారు. కార్మికులను నియమించి గడ్డి తొలగింపు పనులకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకున్నారు. సొంతంగా 5 గడ్డి తొలగింపు మిషన్ల కొనుగోలుతో పాటు ప్రతి నెలా కార్మికులకు జీతాలు చెల్లించనున్నారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో నియోజకవర్గంలో రోడ్లకు ఇరువైపులా గడ్డి, పిచ్చిమొక్కల తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయి. మంత్రి చూపిస్తున్న చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.