కేంద్ర ప్రభుత్వం ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధులు విడుదల చేసింది. 14 వరద బాధిత రాష్ట్రాలకు కలిపి రూ.5,858.6 కోట్లు ఇవ్వగా.. ఇందులో ఆంధ్ర వాటా రూ.1,036 కోట్లు. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు కేటాయించారు. తెలంగాణకు రూ.416.8 కోట్లు ఇచ్చారు. అయితే ఈ రూ.1,036 కోట్లు ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలకు సంబంధించిన నిధులు కాదని సీఎంవో అధికారులు చెప్పారు.
ఆర్థిక సంఘం కేటాయింపుల్లో భాగంగా వచ్చిన నిధులని వెల్లడించారు. విజయవాడ, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వచ్చిన వరదల నష్టంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందజేసింది. మొత్తం రూ.7,600 కోట్ల నష్టం సంభవించినట్లు అందులో వివరించారు. అయితే, ఈ సాయం ఇంకా రాష్ట్రానికి అందలేదని, త్వరలోనే వస్తుందని సీఎంవో అధికారులు తెలిపారు.