‘జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పాలనంతా గాడి తప్పింది. ఖజానాలో చిల్లిగవ్వ లేదు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. వడ్డీనే రూ.లక్ష కోట్లు అవుతోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇటుక ఇటుక పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేంత వరకు ఓ సైనికుడిలా పని చేస్తానని స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో ఆయన ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేశారు.
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ము స్వయంగా అందజేశారు. కుటుంబ సభ్యులతో మమేకమై వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కష్టసుఖాల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ‘ప్రజావేదిక పేదల సేవలో’ సభలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామన్నారు. పేదల జీవితాల్లో వెలుగు చూడాలన్నదే తన సంకల్పమని చెప్పారు. ‘పెంచిన పెన్షన్‌ను ఏప్రిల్ నుంచే ఇస్తానని ఎన్నికల్లో చెప్పినట్లు ఒకేసారి రూ.7 వేలు పంపిణీ చేశాను. మన ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే రూ.12,500 కోట్లు పంపిణీ చేశాం. ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చవుతుంది. ఈ పథకాన్ని శాశ్వతంగా కొనసాగిస్తాం..’ అని తెలిపారు.