విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య పరిష్కారమైంది. కాంట్రాక్టు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అంగీకరించింది. 4200 మంది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగించడంతో.. వారంతా ఆందోళన చేపట్టారు. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కుటుంబసభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక దశలో ఈడీ వర్క్స్ భవనాన్ని సైతం కాంట్రాక్టు ఉద్యోగులు ముట్టడించారు. దీంతో పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ బలగాలను మోహరించాల్సి వచ్చింది. అయితే సమస్య పరిష్కారం కోసం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపుతూ వచ్చింది. ఎట్టకేలకు చర్చలు ఫలించి.. వారిని విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించింది. అనంతరం విశాఖపట్నం ప్రాంతీయ లేబర్ కమిషనర్ సమక్షంలో కార్మిక సంఘాల నేతలు సంతకాలు చేశారు.
మరోవైపు బుధవారం ఉదయం స్టీల్ ప్లాంట్ వద్ద కార్మిక సంఘాల ఆందోళనకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంఘీభావం ప్రకటించారు. దీక్షా శీబిరం వద్ద రోడ్డుపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తుండటం దారుణమని వైఎస్ షర్మిల మండిపడ్డారు. నిర్వాసితులకు ఉద్యోగాలిస్తామని ఇవ్వకుండా రోడ్డున పడేశారు..కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకోనే వీలులేకుండా చేసారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన వైఎస్ షర్మిల..కాంగ్రెస్ పార్టీ కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో లేకపోవడంతో ప్రైవేటీకరణకు పూనుకున్నారని ఆరోపించారు.
స్టీల్ ప్లాంట్ భూముల మీద కేంద్రానికి కన్నుందన్న షర్మిల,. అందుకే ప్రైవేటీకరణ పేరిట కుట్రలు చేస్తోందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌కు కనీసం ముడి సరుకు కొనుక్కోనే పరిస్థితి కూడా లేదన్న వైఎస్ షర్మిల.. పాలకుల నిర్వాకం వలన విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వీర్యం అవుతోందన్నారు. రాష్ట్రంలోని అధికార, విపక్షాలు సైతం కార్మికులకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదన్నారు.
చంద్రబాబు వెంటనే దీక్షా శిబిరాన్ని సందర్శించాలన్న వైఎస్ షర్మిల..14 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు భరోసాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తొలగించిన 4,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని.. లేకపోతే 48 గంటల్లో నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. నాలుగో తేదీ మధ్యాహ్నంలోపు చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని లేకుంటే ప్టాంట్ వద్ద దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అయితే ఈలోపే కాంట్రాక్టు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించింది.