ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేవలం 24 గంటల్లోనే ఓ యువకుడికి ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కోసం సీఎం చంద్రబాబు నాయుడు.. మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు.పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి మరీ.. పింఛన్లు అందించారు చంద్రబాబు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పుచ్చకాయలమడలోని తలారి రంగమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లారు చంద్రబాబు. పింఛన్ అందించిన అనంతరం ఆ కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తన తన చిన్న కుమారుడు అశోక్ పదో తరగతి చదివి అద్దె ఆటో నడుపుతున్నాడని తలారి రంగమ్మ చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తరుఫున ఎలక్ట్రికల్ ఆటో అందిస్తే తమ కుటుంబానికి ఆసరాగా ఉంటుందని అభ్యర్థించారు. అలాగే కవిత అనే మహిళ కూడా తన భర్త ఆపరేషన్ కోసం సాయం చేయాలని కోరింది. దీనిపై స్పందించిన చంద్రబాబు.. రేపటిలోగా ఎలక్ట్రికల్ ఆటో ఇస్తామని, అలాగే ఆ మహిళకు కూడా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు స్థానిక కలెక్టర్‌కు సైతం ఇదే విషయమై ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వేగంగా స్పందించిన కలెక్టర్.. 24 గంటల్లోగా అశోక్‌కు ఆటో అందజేశారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబుతో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో అశోక్ కుమార్‌కు రూ.3.8 లక్షల విలువ చేసే ఎలక్ట్రికల్ ఆటోను అందజేశారు. కవితకు కూడా లక్ష రూపాయల చెక్ అందజేశారు.
అశోక్ కుమార్‌కు ఆటో అందజేసిన తర్వాత.. కలెక్టర్, ఎమ్మెల్యే కలిసి అదే ఆటోలో ప్రయాణం చేసి బోణీ చేశారు. ఈ సందర్భంగా.. 24 గంటల్లో తనకు ఆటో అందించడంపై అశోక్ కుమార్ ఆనందం వ్యక్తంచేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కరోజులోనే సీఎం ఆటో పంపించడం చాలా ఆనందంగా ఉందని.. అశోక్ ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన కష్టాన్ని గుర్తించి వెంటనే సాయం చేసిన చంద్రబాబు మేలును తమ కుటుంబం ఎప్పుడూ మరచిపోదని కవిత కృతజ్ఞతలు తెలియజేశారు.