జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆయన మంగళవారం సాయంత్రం అలిపిరి నడకమార్గంలో తిరుమల చేరుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి వెళ్లారు. వైకుంఠం క్యూలైన్ ద్వారా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి వచ్చే వరకు రంగనాయక మండపం వద్ద ఆయన వేచి ఉన్నారు. ఆ తర్వాత వారితో కలిసి ధ్వజస్తంభానికి మొక్కుకుని బంగారువాకిలికి చేరుకున్నారు. తనతో పాటు తీసుకువచ్చిన ‘వారాహి డిక్లరేషన్’ పుస్తకాన్ని శ్రీవారి పాదాల వద్ద ఉంచి దర్శించుకున్నారు.
ప్రదక్షిణంగా రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు శేషవస్త్రం కప్పి ఆశీర్వచనం చేశారు. తర్వాత టీటీడీ అదనపు ఈవో శ్రీవారి లడ్డూప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చాక పవన్‌కల్యాణ్ తన చేతిలోని వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని మీడియాకు చూపారు. అక్కడ నుంచి నేరుగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకున్నారు. భక్తులకు అన్నప్రసాదాలు వడ్డిస్తున్న తీరును పరిశీలించారు. భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. అన్నప్రసాదాల తయారీ, రోజు ఎంతమంది వస్తున్నారు, ఇటీవల చేపట్టిన మార్పులను టీటీడీ ఉన్నతాధికారులు పవన్‌కు వివరించారు. శ్రీవారి సేవకులకు, భక్తులకు పవన్ నమస్కరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. తిరిగి అతిథి గృహానికి చేరుకున్న ఆయన చాలా వరకు ఏకాంతంగానే గడిపారు. గురువారం ఉదయం జపాలి ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు.