తిరుమల వేంకటేశ్వరస్వామి గురించి మాట్లాడే హక్కు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల విశిష్ట గురించి జగన్ మాట్లాడటం ప్రజల కర్మమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో త్వరలోనే సిట్ విచారణ ప్రారంభం అవుతుందని, నిజాలు నిగ్గు తేలే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. "వేంకటేశ్వరస్వామి తనకు పునర్జమ్మ ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనేకసార్లు చెప్పిన విషయం జగన్ గుర్తుంచుకోవాలి. వైసీపీని లీడర్, క్యాడర్ విడిచిపెట్టిపోతున్న నేపథ్యంలో ఆత్మరక్షణలో జగన్ విలవిలలాడుతున్నారు.
వేంకటేశ్వరస్వామిని నమ్ముతున్నాననే ఒక్కమాట జగన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందనే ఆయన తిరుమల కొండకు వెళ్లలేదు. సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఆలోచనలు ప్రజల ముందుంచారు. ఆయన మంచి ఆలోచనలపై సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది.వైసీపీ హయాంలో తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థను ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ నాశనం చేశారు. టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి అనేక తప్పులు చేశారు. సెట్టింగులు వేసి తిరుమలేశుడిని ఇంటికి రప్పించుకున్న ఘనత జగన్‌కే దక్కుతుంది. జగన్, వైసీపీ పునాదులు కదిలాయి కాబట్టే ఇప్పుడు తిరుమల గురించి ఆయన మాట్లాడుతున్నారు. స్వామివారిని, టీటీడీని అగౌరవపర్చిన వారు దోషులుగా నిలబడే సమయం దగ్గరలోనే ఉంది. వైసీపీ అధినేత ఏపీలో రాజకీయ ఉనికి కోల్పోతున్నారు. దాన్ని కాపాడుకునేందుకే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు తిరుమల కొండపై కమర్షియల్ యాక్టివిటీస్ చేశారు. రూ.150ల గదులను రూ.2వేలకు పెంచారు. వైసీపీ హయాంలో తిరుమలకు సంబంధించి రూ.250కోట్ల టర్నోవర్‌ను రూ.150కోట్లకు తగ్గించారు. వాస్తవాలకు దూరంగా జగన్ మాట్లాడుతున్నారు. తాను చెప్పిందే మాత్రమే నిజమనే భావనలో ఆయన ఉన్నారు. ఏపీ ప్రజలు మాజీ ముఖ్యమంత్రిని ఇంటికి పంపి వంద రోజులే అయ్యింది. అప్పుడే ఎన్డీయే ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై ప్రజల్లో భ్రమ కల్పించే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. కానీ ఆయన మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు" అని అన్నారు.