పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన ఓ ప్రేమజంటకు పోలీసులు షాకిచ్చారు. ఏదో అనుకుని వస్తే.. అక్కడ ఇంకేదో జరిగింది. ప్రియుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోగా.. ప్రియురాలు మాత్రం తప్పించుకుని పారిపోయింది. అతడి గురించి ఆరా తీస్తే అసలు గుట్టు బయటపడింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన మంజూర్ అలీ.. గంజాయి కొనుగోలు చేసేందుకు కొనేందుకు ఇటీవల ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌కు తన ప్రియురాలితో కలిసి వెళ్లాడు.
అక్కడ గంజాయి కొనుగోలు చేసిన తర్వాత.. గురువారం ఉదయం రైలులో విజయనగరం రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఇక్కడి నుంచి ముషీరాబాద్ వెళ్లే రైలు ఎక్కాలని భావించారు. ఇంతలో టిఫిన్ తిందామని బయటకు రాగా.. ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు అనుమానంతో అతడి బ్యాగులను తనిఖీ చేయగా.. గంజాయి దొరికింది. అలాగే రెండు మొబైల్స్, రూ.500 డబ్బుల్ని స్వాధీనం చేసుకున్నారు. అలీ ప్రియురాలు మాత్రం పోలీసుల నుంచి తప్పించుకుంది. అతడి దగ్గర నుంచి 21 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు మంత్రివర్గం ఉపసంఘం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రోన్లు, శాటిలైట్లు, జీపీఎస్ ట్రాకింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత సీసీటీవీలు వంటి సాంకేతికతలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్, జిల్లాకొక నార్కొటిక్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని.. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో గంజాయి సాగును గుర్తించి నిర్మూలిస్తామన్నారు. అంతేకాదు స్మగ్లర్లకు చెక్ పెట్టడం ద్వారా గంజాయి రవాణాను కట్టడి చేయాలని.. వ్యూహాత్మక చెక్‌పోస్టులు, హాట్ స్పాట్‌లు, ప్రత్యేక ఎన్డీపీఎస్ బీట్లు ఇప్పటికే ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.