తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు సతీసమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు.. అక్కడ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అక్కడే ఆలయ అర్చకులు చంద్రబాబుకు వరిమట్టం కట్టారు. నుదుటిపై తిరునామం దిద్దారు. అనంతరం అక్కడి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి వచ్చారు. అక్కడ టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణలతో చంద్రబాబును వేద పండితులు ఆశీర్వదించారు. ఆ తర్వాత శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారికి అత్యధికసార్లు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎంగా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు.