శుక్రవారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి పదవీ స్వీకార సభ జరిగింది. ఈ సందర్భంగా నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ..... పాలన పక్కన పెట్టి కేవలం వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ ఓడిపోలేదని, మోసపోయిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఈ విషయం గ్రహించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ రెండింటిని నిర్వీర్యం చేస్తోందన్నారు. వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయడం తగదన్నారు.
పార్టీ నేత పూనూరి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ వంద రోజుల పాలనలో 60 మందిని పొట్టనబెట్టుకున్న చంద్రబాబుపై 302 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర గ్రంథాలయాల మాజీ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు నెలల కాలంలోనే ప్రజలంతా విసుగెత్తిపోయారని పేర్కొన్నారు.