ఏపీవాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం జరగనుంది. ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులు గురించి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుపతి ఢిల్లీ ఇండిగో విమానం సర్వీసు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలలో స్థలాన్ని పరిశీలించి కొత్త ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేస్తామని కేంద మంత్రి వెల్లడించారు. గతంలో దేశవ్యాప్తంగా 74 విమానాశ్రయాలు ఉండేవన్న రామ్మోహన్ నాయుడు.. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ సంఖ్య 157కు చేరిందన్నారు.
తిరుపతి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసు లేకపోవటంతో గతంలో ఈ ప్రాంతవాసులు ఇబ్బందులు పడేవారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అందుకే తిరుపతి ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు కావాలనే డిమాండ్ ఎక్కువగా ఉండేదన్న ఆయన.. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఢిల్లీ ఇండిగో విమాన సర్వీసు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులను మరింత అభివృద్ధి చేసేందుకు, మరిన్ని సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తిరుపతి, ముంబై, కోయంబత్తూరు, కలకత్తా నుంచి తిరుపతికి డైరెక్ట్ విమాన సర్వీసులు కావాలని భక్తులు కోరుతున్నారన్న రామ్మోహన్ నాయుడు.. భక్తుల కోరిక మేరకు ఆ విషయాన్ని సైతం పరిశీలిస్తామని చెప్పారు. తిరుపతి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ పెంచుతామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏడు విమానాశ్రయాలకు తోడు మరో ఏడు ఎయిర్‌పోర్టులు నిర్మించాలని అనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, పుట్టపర్తి సహా ఏడుచోట్ల విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రం ప్రతిపాదించిన ప్రాంతాల్లో విమానాశ్రయ ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలు, స్థలాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. స్థలం అందుబాటులో ఉంటే త్వరలోనే ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
మరోవైపు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే జూన్ నాటికి ఈ పనులు పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం విజయవాడ ఎయిర్‌పోర్టు సలహా కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి.. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల పెంపునకు చర్చలు జరుపుతున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ను జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపారు.