ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు చంద్రబాబు శుభవార్త.. టీటీడీకి కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 07:12 PM

తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని టీటీడీ అధికారుల్ని ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆయన టీటీడీ అధికారులతో సమావేశమై సమీక్ష చేశారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని.. కొండపై ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదు అన్నారు. ఈ విషయంలోనూ రాజీ పడొద్దని.. ప్రసాదాల నాణ్యత మరింత మెరుగపడాలని సూచించారు.


తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు చంద్రబాబు. ⁠టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై ఆరా తీశారు.. తిరుమలకు ⁠వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలన్నారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని.. ⁠ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచనలు చేశారు. తిరుమల ⁠లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెపుతున్నారని.. ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగాలి, మరింత మెరుగుపడాలన్నారు. ⁠ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని.. అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలన్నారు.


⁠తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలని.. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు ముఖ్యమంత్రి. సింపుల్ గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి….ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని సూచించారు. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని.. దేశ విదేశాలనుంచి వచ్చేవారిని గౌరవించుకోవాలి అన్నారు. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదని.. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలన్నారు. ⁠తిరుమల పేరు తలిస్తే.. ఏడుకొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలన్నారు. ⁠స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలని.. ఇదొక ప్రత్యేకమైన క్షేత్రం అన్నారు. తిరుమల పవిత్రత కాపాడడం, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి సూచించారు.


ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో శ్రీవారి సేవ (స్వచ్చంద సేవను )మరింత బలోపేతం చేయాలి. తద్వారా భక్తులకు సేవకుల ద్వారా చక్కటి సేవలు అందించాలన్నారు. మరోవైపు బయో డైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు ఆరా తీశారు. తిరుమలలో భవిష్యత్‌ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని.. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికి పైగా పెంచాలన్నారు. అటవీ సంరక్షణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పని చేయాలి అన్నారు. అలాగే టీటీడీ అధికారులు మరికొన్ని విషయాలను ముఖ్యమంత్రికి వివరించారు.. అధికారులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com