టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఈమేరకు ఈవో జే శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనతో టీటీడీ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. గత జగన్ సర్కార్ టీటీడీ మాతమ్రే కాదు.. ప్రభుత్వం ఇతర విభాగాల్లో కూడా ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై వివాదం విషయంలోనూ రివర్స్ టెండరింగ్ ప్రస్తావన ఉంది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని అనుసరించి.. నందిని నెయ్యి బదులుగా, పలు డెయిరీల నుంచి నెయ్యిని టీటీడీకి తీసుకున్నారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో టీటీడీ అధికారులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు.
తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇవాళ కొండపై పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్కన అధునాతనమైన వంటశాల గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు రూ.13.45కోట్ల వ్యయంతో రూపొందించిన వంటశాల 37,245 చ.అ.ల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో వంట, ఆహార ధాన్యాలు, కూరగాయలు మరియు పాలు – గ్రౌండ్ ఫ్లోర్‌లో, మొదటి అంతస్తులో ఆహార తయారీ, ఆవిరి ఆధారిత వంట ఎల్పిజి ద్వారా నడిచే బాయిలర్లు మరియు ఒక ఎగ్జాస్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
వారాంతపు సెలవులు మరియు యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కొత్త కేంద్రీకృత వంటశాలలో 1.20 లక్షల మంది యాత్రికులకు, అన్నప్రసాదాలు అనగా పులిహోర, సాంబర్ రైస్, పొగల్ మరియు ఉప్మా సిద్ధం చేసి సిఆర్ఓ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందించడానికి ప్రణాళిక రూపొందించబడింది. ఈ అన్నప్రసాదాలను సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్, పిఎసి- I, రామ్ బాగీచా విశ్రాంతి భవనం వద్ద వున్న బస్ స్టాండ్, ఔటర్ క్యూ లైన్ల వెంట ఫుడ్ కౌంటర్లలో పంపిణీ చేస్తారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై మురళీ కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది. చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.