నెల్లూరు నగరంలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతి శ్రీనివాస వర్మ ప్రారంభించారు. వీఆర్సీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కేంద్రమంత్రి పరిశీలించి ఆపై నిర్వాహకులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్గానిక్ చేపల పెంపకం అన్ని రకాలుగా మంచిదని తెలిపారు. చేప తినడం వలన అనేక అనారోగ్యలకు మంచిదని.. చేప నూనె అనేక మందులలో వినియోగిస్తారన్నారు.
మత్స్యకారులకు ప్రోత్సాహకంగా పీఎం మత్స్య సంపద యోజన ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు. సోమిరెడ్డి అభ్యర్ధనను మత్స్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో పరిశ్రమల కోసం ఢిల్లీలో కృషి చేస్తున్నారన్నారు. గత పాలకుల నిర్వాకంతో తరలిపోయిన పరిశ్రమలను వెనక్కు తీసుకొచ్చే కృషి చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు అనుమతులు, భూమి కేటాయింపుల అవసరాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.