ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 06:16 PM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం సుప్రీం కోర్టు సిట్ కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. టీటీడీ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీ రెండు రోజుల క్రితం రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. అయితే తిరుమల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీటీడీ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.. వారికి కొన్ని సూచనలు చేశారు. ప్రధానంగా భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు టీటీడీ ఈవో జే శ్యామలరావు రంగంలోకి దిగారు.


టీటీడీ ఈవో శ్యామలరావు స్వయంగా భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల వేళ భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, తిరుమలలో టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ ఫీడ్‌ బ్యాక్ తీసుకునే కార్యక్రమాన్ని నిరంతరం ప్రకియగా కొనసాగిస్తామన్నారు ఈవో. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.


గతవారం తిరుమలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ అధికారులకు కీలక సూచనలు చేశారు. తిరుమలలో టీటీడీ సేవలపై భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ⁠వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలి అన్నారు. తిరుమలలో భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని చెప్పారు. ఈ ఫీడ్‌బ్యాక్ తీసుకునే విధానం అన్ని ఆలయాల్లో తీసుకురావాలని సూచించారు. తిరుమలలో లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని.. అలాగే కొనసాగాలి, మరింత మెరుగుపడాలన్నారు.


ఆలయాల్లో ⁠ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యతపై ఫోకస్ పెట్టాలని.. అత్యుత్తమ పదార్థాలు మాత్రమే ఉపయోగించాలన్నారు చంద్రబాబు. అంతేకాదు తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలని.. ఎవరైనా వస్తే హడావిడి కనిపించకూడదన్నారు. టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది భక్తుల విషయంలో గౌరవంగా వ్యవహరించాలని చెప్పారు. దురుస ప్రవర్తన ఉండకూడదని.. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండకు వచ్చి తిరిగి వెళ్లాలన్నారు. ⁠తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని..ఏడుకొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలి అన్నారు.


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి వేణుగోపాల‌స్వామి అలంకారంలో క‌ల్ప‌వృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.


క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com