ఇటీవల తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో కేసు నమోదయ్యింది. ఆయన మత కల్లోలాలు సృష్టించేలా మాట్లాడారని ఆరోపిస్తూ మదురై పోలీసు కమిషనర్‌కు ఆఫీసులో అక్టోబరు 4న ఓ లాయర్ ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం గురించి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. దీనిపై డీఎంకేతో పాటు ఉదయనిధి స్టాలిన్‌లు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మైనార్టీలు, తమిళనాడు డిప్యూటీ సీఎం గురించి, సామాజిక ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది వాంజినాథన్.. మదురై కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేశాయని వ్యాఖ్యానించారు. ముస్లిం, క్రైస్తవులు సహా మైనారిటీలే లక్ష్యంగా విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగం ఉందని చెప్పారు.
దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తల ప్రాతిపదికన.. ఆయనపై తగిన చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏసుక్రీస్తు, అల్లా గురించి తప్పుగా మాట్లాడితే దేశాన్ని తగల బెడుతున్నారని, మరీ హిందూ దేవుళ్ల గురించి మాట్లాడితే హిందువులు అలా ఎందుకు చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారని అన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య వైషమ్యాలు, విద్వేషాలను ప్రేరేపించేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. దేశంలోని ప్రజలంతా మత సామరస్యంతో జీవించాలనేది రాజ్యాంగం ఉద్దేశమని, దానికి విరుద్ధంగా హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య మత కల్లోలాలను సృష్టించేలా పవన్ కల్యాణ్ మాట్లాడారని మండిపడ్డారు.
కాబట్టి ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వాంజినాథన్ తెలిపారు. కాగా, తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరాకు ఒప్పందం చేసుకున్న సంస్థలలన్నీ హిందువులకు సంబంధించనవేనని, ముస్లిం, క్రైస్తవులవి అందులో లేవని అన్నారు. దానిపై పర్యవేక్షణ బాధ్యత హిందూ అధికారిదేనని చెప్పారు. అంతేకాదు, తిరుమల ఆలయ పోటులో ఉండేదీ సనాతన బ్రాహ్మణులేనని పేర్కొన్నారు. అందువల్ల కల్తీ నెయ్యిని గుర్తించే బాధ్యత వారికి ఉందని, వాళ్ల గురించి పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. సనాతనధర్మం గురించి ఏడాదిన్నర కిందట ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారని, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఉదయనిధిని మాత్రమే కాకుండా యావత్తు తమిళనాడు ప్రజలతో పాటు రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌ని కించపరిచేలా ఉన్నాయని లాయర్ ఆరోపించారు.