దేశంలో సతీసహగమనాన్ని బ్రిటిష్ కాలంలోనే నిషేధించారు. విలియం కేరీ, రాజా రామ్‌మోహన్ రాయ్ వంటి సంఘ సంస్కర్తల పోరాట కృషి ఫలితంగా నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1830లో సతీసహగమన నిషేధ చట్టాన్ని చేశారు. అయితే, ఈ చట్టం అమల్లోకి వచ్చిన 158 ఏళ్ల తర్వాత 1987లో రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో ‘సతి’ ఆచారం నిర్వహించడం యావత్తు దేశాన్ని కుదిపేసింది. ఇది అంతర్జాతీయంగానూ పతాక శీర్షికలకు ఎక్కింది. 37 ఏళ్ల కిందట ఈ కేసులో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఎనిమిది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. రూప్ కన్వర్ కేసులో జైపూర్‌లోని ప్రత్యేక కోర్టు బుధవారం (అక్టోబర్ 9) తీర్పు వెలువరించింది.
కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేంద్ర సింగ్, శ్వరణ్ సింగ్, నిహాల్ సింగ్, జితేంద్ర సింగ్; ఉదయ్ సింగ్, దశరథ్ సింగ్, లక్ష్మణ్ షింగ్, భన్వర్ సింగ్‌లను నిర్దోషులుగా పేర్కొంది. రూప్ కన్వర్ సతీకి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇతరులతో కలిసి వీరు ఒక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, సతి కేసులో మొత్తం 45 మందిపై కేసు నమోదుకాగా.. ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంటూ 2004లోనే 25 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. తాజాగా 8 మందికి విముక్తి లభించగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. మిగతా ఎనిమిది మంది చనిపోయారు.
ఏంటీ రూప్ కన్వర్ కేసు?
సికార్‌కు చెందిన రూప్ కన్వార్ (18)కు 1987 జనవరిలో దివ్రాలా గ్రామానికి చెందిన మాల్ సింగ్‌తో వివాహం జరిగింది. అయితే, పెళ్లైన 8 నెలలకే అనారోగ్యానికి గురైన మాల్ సింగ్ సికార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 4, 1987న మృతి చెందాడు. అంత్యక్రియల నిర్వహించిన కుటుంబసభ్యులు.. అతడి చితిపై రూప్ కన్వర్‌ను కూర్చొబెట్టారు.
ఆ నాటి ఘటనను దివ్రాల గ్రామస్తులు గుర్తుచేసుకుంటూ.. ‘సతి’కి ముందు రూప్ కన్వర్‌ను సాంప్రదాయ 'సోల శృంగార్' (16 అలంకారాలు)తో అలకరించి, గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. దీనిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. గాయత్రీ మంత్రం జపిస్తూ భర్త చితిపై కూర్చుని ఆత్మార్పణం చేసిందని అంటారు.
అప్పట్లో ఈ ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజకీయంగానూ తీవ్ర దుమారం రేగడంతో నాటి రాజస్థాన్ సీఎం హరిదేవ్ జోషిని కాంగ్రెస్ తొలగించడానికి ఇది కూడా ఓ కారణం. ‘రూప్ కన్వర్ తనంతట తానుగా సతీసహగమనం చేసింది.. కుటుంబంలో ఎవరూ తప్పు చేయలేదని, 40 ఏళ్లుగా ప్రభుత్వం కోర్టులో దీనికి ఆధారాలను చూపించలేకపోయింది’’ అని రూప్ కన్వర్ సోదరుడు గోపాల్ సింగ్ రాథోడ్ వ్యాఖ్యానించారు.