అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారుకు ప్రమాదం జరిగింది. సీన్ కట్ చేస్తే.. ఆ కారులో చెక్ చేయగా.. ఊహించని సీన్ కనిపించింది. పాడేరు మండలం చింతలవీధి కూడలి దగ్గర చింతలవీధిలో రోడ్డు పక్కన ఓ రేకుల ఇంట్లోకి ఓ కారు దూసుకెళ్లింది. ఎంత ప్రయత్నించినా ఆ కారు బయటకు రాకపోవంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.సమాచారం తెలుసుకున్న పాడేరు పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిశీలించారు. కారులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే దాన్ని బయటకు తీసి తూకం వేయగా 538 కేజీల గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
రోడ్డు ప్రమాదానికి గురైన కారుతోపాటు గంజాయిని పాడేరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. పట్టుబడిన సరకు విలువ రూ.27 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదం జరగడంతో ఈ గంజాయి వ్యవహారం బయటపడింది.
ఈ గంజాయిని మన్యం నుంచి మైదాన ప్రాంతానికి కారులో తరలించే స్మగ్లర్లు దారి మర్చిపోవడంతోనే ఇలా దొరికిపోయినట్లు అనుమానిస్తున్నారు. అరకు వైపు నుంచి వచ్చిన కారు అడారిమెట్ట జంక్షన్ నుంచి ఎడమ చేతివైపు రూట్‌లో వెళ్లాల్సి ఉండగా.. ముందుకు వచ్చి కుడిచేతి వైపు పెదబయలు రహదారివైపు వెళ్లారు. అక్కడ రూట్ మారడంతో వేగంగా కరును వెనక్కి తిప్పే ప్రయత్నంలో బురదలో కూరుకుపోయింది. వెంటనే వాహనాన్ని విడిచి కారులో ఉన్న వ్యక్తులు దిగి అక్కడ నుంచి వేరే కారులో పరారయ్యారని చెబుతున్నారు. ఈ సీన్ మొత్తం చింతలవీధి జంక్షన్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
మరోవైపు విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతవలస టోల్‌గేట్ సమీపంలో చెరువు గట్టు దగ్గర గంజాయి తాగుతున్నముగ్గురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి దగ్గర నుంచి 200 గ్రాముల గంజాయి, మూడు మొబైల్స్‌ను సీజ్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను విశాఖపట్నానికి చెందిన చిరంజీవి, డానియల్ రాజ్, సమంత్‌లుగా గుర్తించారు. వీరికి గంజాయిని సరఫరా చేసిన వారి సమాచారం రాబట్టారు. అలాగే గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కృష్ణాజిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని రూ.6 లక్షలకు పైగా విలువైన 28 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఈ ముఠాలోని ఆరుగురు నిందితుల్లో కేరళకు చెందిన నలుగురు, ఒడిశాలోని కోరాపుట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పోలీసులు కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గంజాయి రవాణాపై ఫోకస్ పెట్టారు.. చెక్‌పోస్టుల దగ్గర తనిఖీలు ముమ్మరం చేశారు.