శ్రీకాకుళం జిల్లాలో విచిత్రమైన చోరీ జరిగింది. జల్‌జీవన్ మిషన్ ద్వారా ప్రభుత్వం కేటాయించిన ఇత్తడి వాటర్ ట్యాప్‌ల దొంగతనం చేస్తున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, పోలాకి మండలాల్లా.. జల్‌జీవన్ పథకంలో భాగంగా కుళాయిల ఏర్పాటు చేస్తన్నారు. అయితే కోటబొమ్మాళిలోని పాకివలస సర్వీసు రోడ్డు పక్కన ఉన్న ఒక షాపులో కంపెనీ నుంచి వచ్చిన ట్యాప్‌లు, ఇతర మెటీరియల్‌ను ఉంచారు. గత నెల 30న అర్ధరాత్రి ఆ షాపులో ఉన్న 25 మూటల్లోని 9వేల ఇత్తడి వాటర్ ట్యాప్‌లు చోరీ అయ్యాయి.
ఈ విషయాన్ని గమనించిన ఎన్‌ఏఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ ఇంఛార్జ్ కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే కోటబొమ్మాళి మండలం జర్జంగి హైవే దగ్గర టాటా మ్యాజిక్ వ్యాన్‌లో కొందరు వ్యక్తులు ఇత్తడి వాటర్ ట్యాప్‌లను తరలిస్తూ దొరికిపోయారు. ఈ ట్యాప్‌ల గురించి ఆరా తీయగా.. ట్యాప్‌లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. తెలంగాణలోని హన్మకొండ జిల్లాకు చెందిన సంపత్, రమేష్, మహేష్, యాదగిరి కూలి పనులు చేస్తుంటారు. ఈ నలుగురు ఇటీవల జల్‌జీవన్ పథకంలో పని చేసేందుకు శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు.
ఈ నలుగురు కోటబొమ్మాళి మండలం చీపుర్లుపాడులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ గ్యాంగ్ ప్రాజెక్టు పని జరిగే చోట సామాగ్రిని దొంగిలించి కోటబొమ్మాళి మండలం కొత్తపల్లిలోని సత్రాపు సింహాచలం స్క్రాప్ షాపులో విక్రయించేవారు. ఈ నలుగురు పెద్ద దొంగతనానికి ప్లాన్ చేశారు. అప్పుడే తమతో పని చేస్తున్న వరహాలమ్మపేటకి చెందిన అప్పన్న, రాముతో కలిసి పాకివలస గోడౌన్‌లో ఉన్న 25 మూటల్లోని రూ.9లక్షల విలువైన 9వేల ఇత్తడి వాటర్ ట్యాప్‌లను ఎత్తుకెళ్లారు. వీటిని విక్రయించేందుకు రాముకి చెందిన టాటా మ్యాజిక్ వ్యాన్‌లో విశాఖపట్నం వెళుతుండగా దొరికిపోయారు. ఈ నలుగురు జర్జంగి నేషనల్ హైవే దగ్గర పోలీసులకు దొరికిపోయారు. ఈ ఆరుగురితోపాటు కొత్తపల్లిలో స్క్రాప్ షాపు యజమానిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
శ్రీకాకుళం జిల్లా దొంగల ముఠా అరెస్ట్
శ్రీకాకుళం జిల్లా ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. సోంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, కాశీబుగ్గలో రెండు గొలుగు దొంగతనాలు జరిగాయి. రాజగోపాల్ అనే వ్యక్తి ముందుగానే రెక్కీ నిర్వహిస్తే.. కిరణ్, ఉమామహేశ్వరరావులు ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, మహిళల ఇళ్లలో చోరీలు చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. రాజగోపాల్, కిరణ్ తండ్రీకొడుకులు కాగా.. మెళియాపుట్టికి చెందిన ఉమామహేశ్వరరావుపై గతంలో కేసులు ఉన్నాయి. వీరికి ఓ మహిళ కూడా సాయపడినట్లు గుర్తించారు. కాశీబుగ్గకు సంబంధించిన రెండు కేసుల్లో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సొంపేట కేసులో బంగారు ఆభరణాలు ఒడిశా రాష్ట్రం బరంపురంలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు ఉన్నాయి.. వాటిని రికవరీ చేసేందుకు నోటీసులు ఇచ్చారు పోలీసులు.