విజయవాడ రైల్వే స్టేషన్‌లో లోకో పైలెట్ దారుణ హత్య కలకలం రేపింది. నగరానికి చెందిన ఏబేలు రైల్వే షంటింగ్ లోకో పైలెట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ఎఫ్ క్యాబిన్ మధ్య బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఏబేలు విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా లోకో పైలెట్‌పై ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడే రైలు పట్టాలపై పడిపోయారు. కొద్దిసేపటికి అక్కడే ఉన్న మరో షంటింగ్ లోకో పైలెట్ పృథ్వీరాజ్ చూసి బాధితుడిని రైల్వే సిబ్బంది సహాయంతో సమీపంలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు.. అక్కడ వైద్యం అందించారు. ఏబేలు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దించి గాలింపు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలను బట్టి నిందితుడికి మానసికస్థితి సరిగా లేదని గుర్తించారు. ఈ ఘటన తర్వాత రైల్వే ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలో ఉన్నారు. లోకో పైలెట్ ఏబేలు హత్య కేసు నిందితుడు రైల్వే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గుడివాడ సెక్షన్‌లోని ఎల్‌సీ గేటు నంబరు 41 దగ్గర పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లోకో పైలెట్‌పై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేసిన తర్వాత అదే రోజు మరో ముగ్గురిపై దాడి చేసి తప్పించుకు తిరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. మిగిలిన రైల్వే స్టేషన్‌లను, పోలీస్ స్టేషన్‌లను అప్రమత్తం చేశారు. గుడివాడ రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో నిందితుడు గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. నిందితుడు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. అతడికి నిజంగా మతిస్థిమితం లేదా.. నటిస్తున్నాడా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. అంతేకాదు నిందితుడిపై గతంలో ఏమైనా పాత కేసులు ఉన్నాయా అని వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల పొరుగు రాష్ట్రంలోని ఓ రైల్వేస్టేషన్‌లోనూ ఇదే తరహాలో ఇద్దరిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి మకాం మార్చి విజయవాడ వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడ్ని పోలీసులు మీడియా ముందుకు తీసుకురావాల్సి ఉంది.. అధికారికంగా కూడా ప్రకటన చేయలేదు.