తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసు సోమవారం ట్విస్ట్ తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పానుగంటి చైతన్య సోమవారం కోర్టులో లొంగిపోయారు. మంగళగిరి కోర్టులో పానుగంటి చైతన్య లొంగిపోయారు. ప్రస్తుతం పానుగంటి చైతన్య వైసీపీ విద్యార్థి విభాగం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2021 అక్టోబర్‌లో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై కొంతమంది దాడి చేశారు. రాళ్లు, కర్రలతో టీడీపీ కేంద్ర కార్యాలయం అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ కేసులో పానుగంటి చైతన్య ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పానుగంటి చైతన్య.. ఇవాళ మంగళగిరి కోర్టు ఎదుట లొంగిపోయారు.
మరోవైపు టీడీపీ ఆఫీసుపై దాడి కేసును.. ఏపీ ప్రభుత్వం ఇటీవలే సీఐడీకి అప్పగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే సాంకేతిక కారణాల నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా మంగళగిరి పోలీసులే దర్యాప్తు జరుపుతున్నారు. ఇక ఈ కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం కూడా మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ముగ్గురు నేతలనూ మంగళగిరిలోని గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో విచారించిన పోలీసులు.. పలు కీలక అంశాలపై వారి నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి జరిగిన రోజు వీరంతా ఎక్కడ ఉన్నారు.. ఎక్కడక్కడా తిరిగారనే వివరాలను పోలీసులు రాబడుతున్నట్లు సమాచారం.
అక్టోబర్ 19వ తేదీ 2021లో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే వంద మంది వరకూ గుర్తించిన పోలీసులు వారిపై కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా లొంగిపోయిన పానుగంటి చైతన్య టీడీపీ ఆఫీసుపై దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇన్నిరోజులూ అజ్ఞాతంలో ఉన్న చైతన్య.. అజ్ఞాతం వీడి బయటకు రావటం, బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరడం ఆసక్తికరంగా మారింది. మరి పానుగంటి చైతన్యలాగే ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్న వ్యక్తులు కూడా బయటకు వస్తారా.. కోర్టు ముందు లొంగిపోతారా అనేది ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.