శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య ఘటన కలకలంరేపింది. అందరూ చూస్తుండగానే రైలు కిందకు దూకడానికి ప్రయత్నించగా తోటి ప్రయాణికులు కాపాడారు.. మళ్లీ రెండోసారి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఓ యువకుడు ఉదయం 7 గంటల సమయంలో.. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా రైలులో నుంచి పలాస రైల్వేస్టేషన్‌లో దిగాడు. అక్కడి నుంచి రైలు కదులుతున్న సమయంలో ప్లాట్‌ఫాం నుంచి ట్రైన్ బోగీల మధ్యకు దూకడానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన తోటి ప్రయాణికులు అతడ్ని పక్కకు లాగేశారు.
ఆ ఘటనలో యువకుడి తలకు తీవ్ర గాయం కాగా.. వెంటనే జీఆర్పీ పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఇంతలో బెంగళూరు నుంచి అసోం వెళ్తున్న కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంపైకి వస్తోంది.. ఆ యువకుడు జీఆర్పీ సిబ్బందిని తోసేసి రైలు ముందుకు దూకేశాడు. పాపం రైలు అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉండగా.. పోలీసులు మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మొదట గాయపడిన సమయంలో ఆ యువకుడు హిందీలో కేకలు వేసినట్లు స్టేషన్‌లో ఉన్నవాళ్లు చెబుతున్నారు. తనకు ఎవరూ లేరు.. ఎవరి కోసం బతకాలి.. తనకు ఎందుకు వైద్యం చేయడానికి తీసుకెళ్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారట. ఈ ప్రమాదం కారణంగా కామాఖ్య ఎక్స్‌ప్రెస్‌ను సుమారు గంట పాటు పలాస రైల్వేస్టేషన్‌లో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. మొదటిసారి ప్రాణాలు తీసుకునేంద ప్రయత్నించగా.. ప్రయాణికులు కాపాడారు. కానీ రెండోసారి మాత్రం మరణాన్ని తప్పించుకోలేకపోయాడు.
మరోవైపు సంతబొమ్మాళి మండలం తెనిగపెంటలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఈ నెల 6న గ్రామంలోని పాఠశాల సమీపంలోని బావిలో రేవతి మృతదేహం బయటపడింది. రేవతికి అదే గ్రామానికి చెందిన పెంట లక్ష్మయ్యకు గతేడాది వివాహం జరిగింది. అయితే ఈనెల 4న అర్ధరాత్రి లక్ష్మయ్య, కుటుంబ సభ్యులు రేవతి కనిపించడం లేదని ఆమె పిన్నికి చెప్పారు. అందరూ కలిసి గాలిస్తుండగా ఆచూకీ దొరకలేదు. వెంటనే సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 6వ తేదీ ఉదయం పాఠశాల సమీపంలో ఉన్న బావి వద్దకు తాగునీరుకు వెళ్లిన స్థానికులు మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కంచిలి మండలం పద్మతులలో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పులి లక్ష్మీనారాయణ, అరుణకుమారి భార్యాభర్తలు. క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నారాయణ మద్యానికి బానిసగా మారి భార్యను వేధిస్తుండేవాడు. మనస్తాపానికి గురైన ఆమె శనివారం రాత్రి ఇంటి పెరట్లోకి వెళ్లి శరీరంపై డీజిల్ పోసుకుని ఆత్యహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన సోంపేట ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం బ్రహ్మపుర తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో చనిపోయింది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.