బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా రాష్ట్రంలో గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. తిరుపతి నుంచి వైజాగ్ వరకు కోస్తా ప్రాంతమంతా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, మచిలీపట్నం, కాకినాడ, విశాఖలో వానలు పడుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు.
రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని తెలిపారు.కాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థలకు కలెక్టర్ శెలవు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అల్పపీడనం, తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, జేసీ కార్తీక్ తీర ప్రాంతాలు, పెన్నా తీరంపై ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్య కారులు సముద్రంలో చేపల వేటకి వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు. వేటకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని ఆదేశించారు.