జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయ్యింది. కొత్త సీఎంగా అక్టోబర్ 16న ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేయనున్నారు. ఇందుకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్‌ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన మరుసటి రోజే తాజా పరిణామం చోటుచేసుకుంది.జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటూ ఎన్‌సీతోపాటు కాంగ్రెస్ నుంచి ఎల్‌జీకి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో అక్టోబర్ 16న కొత్త ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణస్వీకారానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానించారు.