పెసరట్టు తిన్నవాళ్లకే తెలుస్తుంది.. ఆ రుచి ఏంటో.. పెసరట్టు ఉండే రుచే వేరు. అల్లం, పచ్చి మిర్చి వేసి, కొద్దిగా ఉప్మా పెట్టి.. నెయ్యి వేసి దోరగా కాల్చుకుని తింటే..తిన్నవాళ్లు ఆహా అంటారు. చెబుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అంత రుచిగా ఉంటుంది పెసరట్టు. పెసరట్టుకు మరే పోటీ లేదు. ఇంతకు ముందు రోజుల్లో వారంలో రెండు సార్లు అయినా పెసరట్లు వేసేవారు. కానీ ఇప్పుడు వీటిని పెద్దగా ఎవరూ తినడం లేదు. పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలానే లభిస్తాయి. పెసలతో వడలు వేసినా చాలా రుచిగా ఉంటాయి. ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తీసుకున్నా టేస్టీగానే ఉంటాయి. గ్యాస్ అని చాలా మంది వీటిని పక్కన పెట్టేశారు. కానీ ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతి రోజూ ఉడకబెట్టినవి ఓ గుప్పెడు తిన్నా చాలా మంచిది. పెసలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసల్లో ఉండే పోషకాలు:
విటమిన్లు బి2, బి3, బి5, బి6, బి1, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ఫొటాషియం, ఫోలేట్, మాగనీస్, జింక్, ఫైబర్, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి.
రోగ నిరోధక శక్తి:పెసలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటే ఎలాంటి వ్యాధులు వచ్చినా తట్టుకుంటారు. అలసట, నీరసం దరి చేరకుండా ఉంటాయి. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
జీర్ణ సమస్యలు మాయం:ప్రస్తుత కాలంలో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో పెసలు చక్కగా పని చేస్తాయి. పొట్ట ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి. కడుపులో ఉండే మలినాలు, వ్యర్థాలను బయటకు పంపుతుంది.
రక్త హీనత:రక్త హీనత సమస్యతో ఇబ్బంది పడేవారు పెసలు తినడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ సమస్య లేని వాళ్లు తిన్నా ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. రక్తం పడితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.
బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్:పెసలు తినడం వల్ల శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
అదుపులో షుగర్ వ్యాధి:బీపీ, షుగర్ వ్యాధులతో బాధ పడేవారు రెగ్యులర్‌గా పెసలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. షుగర్ అనేది అదుపులోకి వస్తుంది. పెసలు తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరగవు.