తన భర్త నుంచి తనకు, తన కుమారుడికి రక్షణ కల్పించాలని చిత్తూరులోని మురకంబట్టు కొత్తూరుకు చెందిన రోజా కోరారు. బుధవారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ పెనుమూరు మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన పట్టాభితో 13 సంవత్సరాల క్రితం నాకు పెళ్లి జరిగింది.మాకు 12 సంవత్సరాల కొడుకున్నాడు. వివాహమైనప్పటి నుంచి నా భర్త నన్ను అనుమానిస్తూ, మానసికంగా హింసించేవాడు. కొడుకు కోసం ఎన్నో భరించాను, కానీ అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ విషయం మా అమ్మానాన్నలకు చెప్పినా పట్టించుకోలేదు.
ఈ ఏడాది మే నెలలో నన్ను నా భర్త కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. వేరే మార్గంలేక బెంగళూరు వెళ్లిపోయి మా చెల్లెలి ఇంట్లో తలదాచుకున్నా. జూన్ 21వ తేది విడాకుల కోసం దరఖాస్తు చేశా. దీంతో రెండు నెలల క్రితం నా భర్త నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నేను స్టేషన్‌కు వెళ్లి నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఎస్‌ఐకి స్టేట్‌మెంట్ ఇచ్చా. అయితే స్టేషన్ వద్దే నా భర్త చంపుతానని బెదిరించాడు. నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే మా ఊరికి చెందిన రైల్వే కానిస్టేబుల్ జ్ఞానశేఖర్‌ను ఇందులో ఇరికిస్తున్నాడు. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు’ అని చెప్పారు. నాకు పోలీసులు అండగా నిలవాలని కోరారు.