యువగళం పాదయాత్రలో టీడీపీ యువనేత, మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 17న వాల్మీకి జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని పేర్కొంది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని యువగళం పాదయాత్రలో లోకేశ్‌కు అప్పట్లో భారీ సంఖ్యలో వినతులు అందాయి.
ఈ నేపథ్యంలో బీసీల ఆత్మగౌరవానికి ప్రాముఖ్యతనిస్తూ అప్పట్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన మరో హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు యువగళం పాదయాత్రలో తనను కలిసి విన్నవించారన్నారు. వారి సెంటిమెంటును గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.