ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు పథకాల పేరుతో మభ్యపెట్టి.. అధికారం చేపట్టాక ఆ హామీలను అమలు చేయడం లేదన్నారు. గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నిన్నటి క్యాబినెట్ మీటింగ్‌లో సూపర్ సిక్స్‌లో ఒక్క సిక్స్ గురించి అయినా చర్చిస్తారు. ఒక్కటైనా అమలు చేస్తారని అనుకున్నాం. మహిళలకు శుభవార్త చెప్తారని అనుకున్నాం. ఉచిత సిలిండర్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఈ రెండూ లో బడ్జెట్ స్కీమ్‌లు. వీటిని అమలు చేస్తారని భావించాం. కానీ, ఎక్కడా వాటిని ప్రస్తావించలేదు. బాబు సూపర్ సిక్స్‌లు గాలికి కొట్టుకు పోయాయి.
కొత్తగా సిక్స్ పాలసీలు వచ్చాయి. కొత్త పరిశ్రమలు వస్తే మంచిదే. పెట్టుబడులు రావాలి. ఉద్యోగాలు రావాలి. రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తామన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జాబ్ ఫస్ట్ అనేది తమ నినాదం అని సీఎం చంద్రబాబు చెప్పారు.’ అని షర్మిల గుర్తు చేశారు. ‘మాటలన్నీ బాగానే చెప్పారు. కానీ, ఇక్కడే బిలియన్ డాలర్ల ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇవన్నీ అమలు చేసే చిత్తశుద్ది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా? 2014లో పెద్ద పెద్ద పథకాలు అన్నారు. అమరావతిని సింగపూర్ అన్నారు. 3D గ్రాఫిక్స్ చూపించారు. అప్పుడు చెప్పిన వాటికి, ఇప్పుడు చెప్పిన వాటికి తేడా లేదు. పాత సినిమాకి కొత్త టైటిల్ పెట్టారు. చంద్రబాబు చెప్తుంటే ఈ కథ ఎక్కడో విన్నట్లుంది అనిపించింది. పాత గిఫ్ట్ కొత్త బాక్స్‌లో ఇస్తున్నారు. ఇవి అమలు అవుతాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి.’ అని సందేహం వ్యక్తం చేశారామె.