ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తు్న్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, రెవెన్యూ, పోలీసు అధికారులతో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌తో మంత్రి చర్చించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. తుపాను ప్రభావం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు.
కలెక్టరేలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని మంత్రి చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. ఆనం ఆదేశాలతో ముఖ్యంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఆర్డీవో పావని, అధికారులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.