ఇల్లు కట్టుకునేవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఇల్లు, ఇతరత్రా సొంత నిర్మాణాల కోసం రీచ్‌ల నుంచి ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లే విధంగా ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఉత్తర్వుల ప్రకారం స్థానిక అవసరాల కోసం ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు. ఇందుకోసం ఎలాంటి ఫీజు వసూలు చేయరు. రీచ్‌ల నుంచి ఉచితంగా ఇసుకను తీసుకెళ్లేందుకు గతంలో ఎడ్లబండ్లకు మాత్రమే అనుమతి ఉండేది.. కానీ ఇప్పుడు ఈ నిబంధనను ట్రాక్టర్లకు కూడా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఉచిత ఇసుక విధానం అని చెప్తున్నప్పటికీ.. ఉచితంగా ఇసుక లభించడం లేదంటూ గత కొంతకాలంగా ప్రభుత్వ విధానంపై విమర్శలు వస్తున్నాయి. వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా దీనిపై పదే పదే ప్రభుత్వం టార్గెట్‌గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. సీనరేజ్, ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. ఈ ఛార్జీల కారణంగా ట్రాక్టర్ ఇసుక రేటు గతంలో మాదిరిగానే ఉంటోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సొంత అవసరాల కోసం రీచ్‌ల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని తెలిపారు. ఇక బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే విషయమై ఏపీ కేబినెట్ చర్చించింది.
సొంత అవసరాల కోసం వాగులు, వంకల్లో నుంచి ఇసుకను ఉచితంగా తవ్వి తీసుకెళ్లడానికి అనుమతించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇస్తామని మాటిచ్చామన్న చంద్రబాబు.. సొంత అవసరాల కోసం ఎక్కడైనా ఉచితంగా ఇసుకను తవ్వి తీసుకెళ్లవచ్చని చెప్పారు. దానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని.. ఎవరికీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. అయితే పెద్ద నదుల విషయంలో మాత్రం నిబంధనలు పాటిస్తామని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా.. రీచ్‌ల నుంచి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలోఇసుక తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.