కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో వచ్చె నెల నుంచి మండల-మకరవిళక్కు పూజల సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయ్యప్ప సన్నిధానం, మాలికాపురం ఆలయ ప్రధాన పూజారుల (మెల్‌సంథి) ఎంపిక గురువారం జరిగింది. అయ్యప్ప ఆలయం కోసం 25 మందిని షార్ట్‌లిస్ట్ చేసి లాటరీ నిర్వహించారు. పందళం రాజవంశానికి చెందిన బాలుడు రిషికేశ్ వర్మ చేతుల మీదుగా జరిగిన ఈ లాటరీలో ప్రధాన పూజారిగా కొల్లం జిల్లా శక్తికులంగరకు చెందిన అరుణ్ కుమార్ నంబూద్రి ఎంపికయ్యారు.
అలాగే, మాలికాపురం ఆలయం కోసం 15 మందిని షార్ట్ లిస్ట్ చేయగా.. పందళం వంశానికి చెందిన బాలిక వైష్ణవి లాటరీ తీశారు. ఆ ఆలయ ప్రధాన పూజారిగా కొజికోడ్‌కు చెందిన వాసుదేవన్ నంబూద్రి నియమితులయ్యారు. నెలవారీ పూజల కోసం శబరిమల ఆలయం గురువారం ఉదయం తెరుచుకుంది. ఉషాపూజ (ఉదయం పూజ) అనంతరం నిర్వహించిన సంప్రదాయ డ్రా విధానంలో పూజారుల ఎంపిక జరిగింది. ముఖ్య పూజారులు (తంత్రిలు) కందరారు రాజీవరు, కందరారు బ్రహ్మదత్తన్, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, బోర్డు సభ్యులు, ఇతర ఉన్నతాధికారుల ఇందులో పాల్గొన్నారు. శబరిమల ఆలయానికి 25 మంది, మాలికాపురత్తమ్మ ఆలయానికి 15 మంది పూజారులతో కూడిన ప్రాథమిక జాబితా నుంచి ఈ ప్రధాన పూజారులను ఎంపిక చేస్తుంటారు.
ఈ ఏడాది మండల-మకరవిళక్కు (మకరజ్యోతి)పూజల సమయంలో కేవలం వర్చువల్ క్యూ విధానం అమలుచేస్తామని, ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు ముందస్తు బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించారు. స్పాట్ బుకింగ్ రద్దు చేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భక్తులతో పాటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. స్పాట్ బుకింగ్ కూడా కొనసాగిస్తామని అక్టోబరు 15న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే వీ జాయ్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
మరోవైపు, మండల-మకరవిళక్కు పూజల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్నాహాలు, ఏర్పాట్లు, భక్తుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతపై చర్చించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేరళ దేవాదాయ శాఖ మంత్రి, టీబీడీ ఛైర్మన్, అధకారులు, పత్తనంతిట్టా జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు. గతేడాది ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు రావడంతో కేరళ ప్రభుత్వం ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ముందుగానే మేల్కొవడం చెప్పుకోదగ్గ అంశం.